: ‘స్పైడర్ కామ్’పై కోహ్లీ అసహనం
రేపు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 500వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా స్పైడర్ కామ్ ను వినియోగించనున్నారు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని కోరగా కొంత అసహనానికి గురయ్యాడు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్పైడర్ కామ్ కాన్సెప్ట్ క్రికెట్ నిబంధనలకు ఆటంకం కలిగించకూడదని అన్నాడు. అయితే, స్పైడర్ కామ్ ను ఓవర్ల మధ్య గానీ, ఒక బాల్ ముగిసిన తర్వాత గానీ వినియోగిస్తే బాగుంటుందని కోహ్లీ అన్నాడు. ఈ సందర్భంగా ఈ ఏడాది మొదట్లో సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన 5వ వన్డే మ్యాచ్ లో జరిగిన సంఘటనను కోహ్లీ ప్రస్తావించాడు. తాను కొట్టిన బంతి బౌండరీకి వెళ్లిందని, అయితే, స్పైడర్ కామ్ ను తాకడం వల్ల అంపైర్ డెడ్ బాల్ గా ప్రకటించాడని అన్నాడు. ఆ సమయంలో తాను చాలా నిరుత్సాహపడ్డానని అన్నాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగే సమయంలో ఇటువంటి పరిణామాలను తాను ఇష్టపడనని చెప్పాడు.