: యూరీ ఘటనపై ‘పాక్’ కు సమన్లు జారీ
జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ పై జరిగిన ఉగ్ర దాడులకు సంబంధించి పాకిస్తాన్ కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్, భారత్ లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కు సమన్లు జారీ చేశారు. సౌత్ బ్లాక్ లోని క్యాబినెట్ సెక్రటేరియట్ లో రెండు దేశాల నేతలు సమావేశమయ్యారు. యూరీ ఘటనలో ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారనడానికి గల ఆధారాలను ఈ సందర్భంగా బాసిత్ కు అందజేశారు. ఈ ఘటనలో హతమైన నలుగురు ఉగ్రవాదుల వద్ద లభించిన గ్రనేడ్ లు, ఆహార ప్యాకెట్లపై పాకిస్థాన్ గుర్తులు ఉన్న ఆధారాలను ఆయనకు ఇచ్చారు. కాగా, పాకిస్థాన్ నియంత్రిత భూభాగంలో భారత్ పై ఉగ్ర దాడికి పాల్పడే ఎవ్వరికీ అనుమతి ఇవ్వవద్దనే నిబంధనకు తమ దేశం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా బాసిత్ వెల్లడించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.