: 'ఆప్' ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడుతోంది. ఢిల్లీలో ఇప్పటికే 11 మంది శాసనసభ సభ్యులు పలు కేసుల్లో అరెస్టైన విషయం తెలిసిందే. మరో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై 32 ఏళ్ల ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు సేకరించిన పోలీసులు ఈరోజు ఆయనను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ... ఖాన్ తనతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడికి గురిచేస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనపై వస్తోన్న ఈ ఆరోపణలను ఖాన్ ఖండించారు. పోలీసులకి ఫిర్యాదు చేసిన మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కుట్రపూరితంగా తనపై ఈ చర్యకు దిగారని ఖాన్ ఆరోపిస్తున్నారు. ఆరోపణల నేపథ్యంలో ఖాన్ నిన్న జమియా నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఆయనను తమ దర్యాప్తు ప్రకారమే అరెస్టు చేస్తామని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. కాగా, ఈరోజు ఆయన ఇంటికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు.