: పంజాబీ మహిళ దెబ్బకు పరుగెత్తిన దొంగ!
కిరాణా దుకాణాన్ని నిర్వహించే ఒక పంజాబీ మహిళను భయపెట్టి డబ్బు దోచుకుందామనుకున్న ఒక దొంగను ఆమె పరుగులు పెట్టించింది. అంతేకాదు, ఆ దొంగకు ఐదేళ్ల జైలు శిక్ష పడేలా కూడా చేసింది. ఆ వివరాలలోకి వెళితే, కరంజిత్ సంఘా అనే 49 సంవత్సరాల మహిళ యూకేలోని హల్ ప్రాంతంలో ఒక కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. రోజూ మాదిరిగానే గత మే 26వ తేదీన కూడా ఆమె తన దుకాణాన్ని తెరిచింది. తాపీగా టీ తాగుతూ, డబ్బు లెక్కిస్తున్న ఆమె వద్దకు స్టువర్ట్ గ్లీసన్ అనే ఒక దొంగ ఒక కత్తి పట్టుకుని వచ్చాడు. ఆమెను డబ్బులివ్వమంటూ ఆ కత్తితో బెదిరించాడు. ఇదేమీ పట్టించుకోని కరంజిత్ ఎంచక్కా టీ తాగుతూ కూర్చుంది. అంతేకాకుండా, తాను టీ తాగడం పూర్తయ్యేవరకు ఆగమని చెప్పింది. అదేమీ కుదరదని, తనకు ముందు డబ్బులివ్వాలని మళ్లీ బెదిరించాడు. ఇక లాభం లేదనుకున్న కరంజిత్, తన పక్కనే ఉన్న చిన్న కత్తిని అందుకుని, దొంగ వైపు తిరిగి తీక్షణంగా చూసింది. అంతే, ఆమె ఉగ్రరూపం చూసి, చెమటలు పట్టిన స్టువర్ట్ పరుగులు పెట్టాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇది కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడు స్టువర్ట్ పై న్యాయమూర్తి పలు సెక్షన్ల కింద ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. కాగా, దొంగను చూసి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్న కరంజిత్ ను మాత్రం అక్కడివారు ప్రశంసించారు.