: రాజనీతిని ప్రదర్శించి సమస్యను పరిష్కరించుకోవాలి.. ఢిల్లీ వరకు రాకూడదు: ఇరు రాష్ట్రాల సీఎంలతో ఉమాభారతి
ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఈరోజు జరిపిన సమావేశం ముగిసిన అనంతరం మీడియాకు ఉమాభారతి పలు వివరాలు వెల్లడించిన తరువాత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు అంశంపై కేంద్రమంత్రితో మరోసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే, అంతకు ముందు జరిగిన అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలపై ఉమాభారతి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పలు సూచనలు చేశారు. ఇలాంటి అంశాల కోసం ఢిల్లీ వరకు చర్చకు రావడం సరికాదని ఉమాభారతి సూచించారు. పాలమూరు రంగారెడ్డి, డిండీ ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ ప్రాజెక్టులు పాతవేనని తెలంగాణ తెలపగా, అవి కొత్తవని ఏపీ తెలిపినట్లు సమాచారం. కొత్త ప్రాజెక్టులపై ఏపీ వినిపిస్తోన్న వాదనపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఉమాభారతి సూచించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు రాజకీయ అనుభవం ఉన్నవారని, రాజనీతిని ప్రదర్శించి సమస్యను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఉమాభారతి సూచించారు. మరోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం అంటూ ఏమీ ఉండబోదని తేల్చిచెప్పారు. సమావేశంలో ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టులపై తమ వాదనలు వినిపించాయి. ఈ సమయంలోనే ఆమె పలుసార్లు జోక్యం చేసుకొని సూచనలు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.