: పోలీసుల అదుపులో ఏడుగురు భర్తల భార్య
కర్ణాటకలో ఏడుగురిని వివాహం చేసుకుని వంచించిన యాస్మిన్ భాను (38) పోలీసులకు చిక్కింది. ఇటీవల ఆమె మూడవ భర్త ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి రాగా, దేశవ్యాప్తంగా మీడియాలో కవరేజ్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల అరెస్ట్ తరువాత, ఆమెను విచారించగా, తాను తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్ అనే వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకున్నానని, మరెవరినీ పెళ్లి చేసుకోలేదని చెప్పినట్టు సమాచారం. కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఇమ్రాన్ ను బెదిరించి రూ. 10 లక్షలతో ఉడాయించిన యాస్మిన్, ఆపై డబ్బున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారిని పెళ్లి పేరుతో మోసం చేసి, కొంత కాలం కాపురం చేశాక, వారిని బెదిరించి డబ్బుతో పారిపోయేదని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తన నాలుగో భర్తతో కలసి మూడో భర్తను బెదిరించి, దాడి చేయించిందన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాఫ్తు ప్రారంభించినట్టు తెలిపారు.