: ఆ సమయంలో మళ్లీ డ్యాన్స్ చేయగలనన్న నమ్మకం పోయింది: ప్రభుదేవా


ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన ప్రభుదేవా ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. ఈ సందర్భంలో తాను పడ్డ బాధ వర్ణనాతీతమన్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా ఓ త్రిభాషా చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో ‘అభినేత్రి’, తమిళ్ లో ‘దేవి(ల్)’, హిందీలో ‘టుటక్ టుటక్ టుటియా’ పేరిట ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో.. డ్యాన్స్ చేస్తుండగా తన వీపులో ఏదో జరిగినట్లు అనిపించిందని... ఆ తర్వాత తాను ఇక కదలలేకపోయానని, అలాగే కిందపడిపోయానని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని అన్నాడు. ఆ చిత్ర నిర్మాత వెంటనే తనను ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందన్నాడు. డ్యాన్స్ చేసే విషయం పక్కన పెడితే, కనీసం తాను మళ్లీ లేచి నిలబడగలనా? అని భయపడ్డానని చెప్పాడు. తనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో తన మనసు కుదుటపడిందని అన్నాడు. ఐదుగంటల పాటు భరించలేని నొప్పితో విలవిలలాడిపోయానని, కాళ్లూచేతులు ఆడకపోతే జీవితం ఎలా గడుస్తుందనే ఆలోచన తనను ఎంతో భయానికి గురిచేసిందన్నాడు. తానెప్పుడూ కొత్త స్టెప్పులకు ప్రయత్నిస్తానని.. అయితే, ఈ సంఘటన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిసొచ్చిందని ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా అన్నాడు.

  • Loading...

More Telugu News