: కావేరి జలాల వివాదం: మాండ్యాలో మ‌ళ్లీ ఉద్రిక్త ప‌రిస్థితులు.. రాజీనామా చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు


కావేరి జల వివాద అంశంలో ఇటీవ‌లే కర్ణాటక, తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళ‌లు చెల‌రేగిన విష‌యం తెలిసిందే. దీనిపై మ‌రోసారి పిటిష‌న్ వేసిన క‌ర్ణాట‌కకు సుప్రీంలో ఎదురుదెబ్బ త‌గిలిన నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో మ‌ళ్లీ ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు ఈరోజు నుంచి ఈనెల 27 వ‌ర‌కు తమిళనాడుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుద‌ల చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన అంశంపై మాండ్యా ప్రాంత రైతులు మండిప‌డుతున్నారు. రోడ్ల‌పైకి వ‌చ్చి ఆందోళనలు తెలుపుతున్నారు. త‌మిళ‌నాడుకు కావేరీ జలాలు వదులుతూ తమకు ఉరిశిక్ష వేస్తున్నంత ప‌నిచేస్తున్నార‌ని వారు వాపోతున్నారు. రోడ్ల‌పై ఉరి వేసుకున్నట్లుగా ప్రదర్శనలు ఇస్తూ నిర‌స‌న తెలుపుతున్నారు. మాండ్యా ప్రాంతానికి చెందిన‌ జనతాదళ్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయ‌కులంతా మూకుమ్ముడిగా రాజీనామా చేశారు. క‌ర్ణాట‌క‌లోని ప‌లు ప్రాంతాల వారు కూడా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర‌రాజ‌ధాని బెంగళూరులో భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాలు మోహరించారు. పోలీసు అధికారులు ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రాష్ట్ర‌ప్ర‌జ‌లు కావేరీ జ‌లాల అంశంలో సంయమనం పాటించాలని కర్ణాటక హోంమంత్రి కోరారు.

  • Loading...

More Telugu News