: హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద కుంగిన రోడ్డు... భారీ ట్రాఫిక్ జాంలో ప్రజల అవస్థ
గత రాత్రంతా కురిసిన వర్షాలకు హుసేన్ సాగర్ ను ఆనుకుని ఉన్న ప్రధాన రహదారిపై ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద రోడ్డు కుంగింది. దాదాపు రెండు అడుగులకు పైగా వ్యాసంతో పెద్ద గుంత పడగా, చుట్టూ నాలుగు మీటర్ల పరిధిలో భూమి లోపలికి కుంగింది. ఈ ఉదయం ఓ ద్విచక్ర వాహనదారు ఆ దారిలో వస్తుండగా, ఒక్కసారిగా భూమి కుంగి, అతని వాహనం లోపలికి జారింది. దీన్ని చూసిన ఎన్టీఆర్ గార్డెన్స్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని కాపాడారు. ఆపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, బారికేడ్లు పెట్టి ఆ వైపుగా ఎవరినీ రాకుండా కట్టుదిట్టం చేశారు. కింది భాగంలో నాలా ఉన్న కారణంగానే రోడ్డు కుంగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో నక్లెస్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర అవస్థ పడుతున్నారు.