: బిగుస్తున్న ఉచ్చు... 'పాక్ ఉగ్రదేశమే' అంటూ అమెరికా చట్టసభల ముందుకు అతి ముఖ్యమైన బిల్లు
ఇప్పటివరకూ పాకిస్థాన్ కు మిత్రదేశంగా ఉన్న అమెరికా, ఆ దేశం ఉగ్రవాదులకు ఇస్తున్న సహకారంతో మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పాకిస్థాన్ ఉగ్రదేశమేనంటూ, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని సూచిస్తూ, అత్యంత కీలకమైన బిల్లు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ముందుకు వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ప్రజా ప్రతినిధి, హౌస్ సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన డానా రోహ్రబాకర్ లు ఈ బిల్లును సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పాకిస్థాన్ కచ్చితంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశమే. పాక్ కు ఇస్తున్న ద్వైపాక్షిక సాయాన్ని నిలిపివేయాల్సిన సమయం వచ్చింది. ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి" అని అన్నారు. ఇకపై ఎంతమాత్రమూ పాకిస్థాన్ ను నమ్మలేమని, విశ్వసనీయతలేని మిత్రదేశంగా పాక్ మారిందని, అమెరికాకు శత్రువులను ఎన్నో ఏళ్లుగా ఆ దేశం పెంచి పోషిస్తోందని పోయ్ ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్ కు పాక్ ఆశ్రయం ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, హక్కానీ నెట్ వర్క్ తో పాక్ బంధం గురించి మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ఏ వైపున ఉందో ప్రపంచానికి తెలుసునని, ఆ దేశం అమెరికా వైపు మాత్రం లేదని అన్నారు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం లేదా? అని ప్రశ్నించిన ఆయన, దీనికి 90 రోజుల్లోగా అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, యూరీ దాడులపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు పేట్ ఓల్సన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, అమెరికాకు బలమైన భాగస్వామ్య దేశంగా ఉన్న ఇండియాలోని కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రదాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. 18 మంది జవాన్ల మృతిని ప్రస్తావిస్తూ, ఇంత క్రూరమైన చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలిపి శిక్షించాలని సూచించారు.