: ప్రభుత్వంపై అరవడంతో సమస్య పరిష్కారం కాదు!: తలసాని
హైదరాబాద్లో కురుస్తోన్న వర్షంతో నగరం జలమయం అయింది. భాగ్యనగర పరిస్థితిపై పలు ప్రాంతాల్లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి సృష్టించిన బీభత్సాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో సిబ్బంది రంగంలోకి దిగారని చెప్పారు. ఆనాడు సంవత్సరాల తరబడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని, హైదరాబాద్లో వారు పైపైన మాత్రమే పనులు చేయడంతో వర్షాలకి నీళ్లు నిలిచిపోతున్నాయని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై అరవడంతో సమస్య పరిష్కారం కాదని అన్నారు. సమస్యలని అధిగమించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది నుంచి సమగ్రస్థాయిలో హైదరాబాద్లో పనులు చేస్తున్నామని తలసాని చెప్పారు. అందుకోసం అవసరమైన పరికరాలను తెప్పించినట్లు చెప్పారు. అధికారులు, కార్పోరేటర్లు కలిసి పలు ప్రాంతాల్లో వాలంటరీలను నియమించినట్లు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుందనే ఉద్దేశంతో తాము విద్యుత్తు ఆపేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దానికి కూడా కరెంటు లేదంటూ తమపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ నిమిషాల్లో సమస్యల గురించి తెలుసుకుంటూ, పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో పరిస్థితిపై ఎన్నో వదంతులు కూడా వస్తున్నాయని ఆయన అన్నారు. ఏ సమస్య తలెత్తినా దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజలు భయపడవద్దని సూచించారు. అన్ని శాఖలు అలర్ట్గా ఉన్నాయని చెప్పారు.