: బయటపడ్డ పాక్ దుర్మార్గం... భారత్ దళాలు పాక్ ఉచ్చులో పడుంటే ముష్కరులు చొరబడేవారే!


ఇండియాలో మారణహోమం సృష్టించాలన్న ఏకైక లక్ష్యంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దులు దాటడానికి ప్రయత్నించిన వేళ, భారత సైన్యం దాన్ని గట్టిగా అడ్డుకుని 10 మందికి పైగా ముష్కరులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ జరగడానికి ముందు మరో ఆసక్తికర ఘటన జరుగగా, పాక్ దుశ్చర్య, దుర్మార్గపు ఆలోచనా వెలుగు చూశాయి. యూరీ సెక్టారులోని ఆర్మీ పోస్టుపై దాడి జరిగి 48 గంటలు గడవకుండానే అదే ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, 20 నిమిషాల పాటు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కాల్పులు ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండానే జరిగాయి. ఇప్పుడు పాక్ కాల్పుల వెనుక అసలు ఉద్దేశం బయటకు వచ్చింది. ఉగ్రవాదుల చొరబాటుకు ముందు, వారు సురక్షితంగా హద్దులు దాటేలా చూడాలన్న ఆలోచనతో కవర్ ఫైర్ గా కాల్పులు జరిపినట్టు సైన్యాధికారులు అనుమానిస్తున్నారు. పాక్ వైపు నుంచి కాల్పులు జరుపుతుంటే, అందరి దృష్టి తమవైపే ఉంటుందని, ఇదే అదునుగా ఉగ్రవాదులను కంచె దాటించవచ్చని ఆ దేశం ప్లాన్ వేసింది. కానీ ఆ పాచిక పారలేదు. అప్పటికే పూర్తి సన్నద్ధంగా ఉన్న భారత జవాన్లు ముష్కరమూక రాకను పసిగట్టడం, హోం శాఖ నుంచి వచ్చిన 'గో ఎహెడ్' ఆదేశాలు, ఆపై భీకర ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మన సైన్యం పాక్ కాల్పులవైపు దృష్టిని సారించి, మిగతా ప్రాంతాలపై ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి వుండేవారే.

  • Loading...

More Telugu News