: ఉద్యోగినులకు ఢిల్లీ అత్యంత ప్రమాదకరం... సిక్కిం సేఫెస్ట్... సెకండ్ బెస్ట్ తెలంగాణే!


ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఏఏ నగరాలు అత్యంత భద్రతను అందిస్తున్నాయన్న విషయంమై అమెరికా సంస్థ సీఎస్ఐఎస్ (సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్) నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో ఉద్యోగినులకు అత్యంత భద్రతను అందిస్తున్న ప్రాంతంగా సిక్కిం నిలువగా, అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. మహిళలకు పనిగంటలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, లైంగిక వేధింపులు, మొత్తం ఉద్యోగుల్లో మహిళల శాతం, వారికి లభించే ప్రోత్సాహకాలు, మహిళా ఔత్సాహికులు నడుపుతున్న కంపెనీలు తదితరాల ప్రాతిపదికన పాయింట్లు ఇవ్వగా, సిక్కిం 40 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీకి కేవలం 8.5 పాయింట్లు మాత్రమే దక్కాయి. కాగా, సిక్కిం తరువాత రెండో స్థానంలో మహిళా ఉద్యోగులకు తెలంగాణ అత్యుత్తమమని ఈ అధ్యయనంలో వెల్లడైంది. తెలంగాణకు 28.5 పాయింట్లు వచ్చాయి. ఆ తరువాతి స్థానాల్లో పుదుచ్చేరి (25.6 పాయింట్లు), కర్ణాటక (24.7 పాయింట్లు), హిమాచల్ ప్రదేశ్ (24.2 పాయింట్లు), ఆంధ్రప్రదేశ్ (24 పాయింట్లు), కేరళ (22.2 పాయింట్లు), మహారాష్ట్ర (21.4 పాయింట్లు), తమిళనాడు (21.1 పాయింట్లు, చత్తీస్ గఢ్ (21.1 పాయింట్లు) నిలిచాయి. ఇండియాలోని సిక్కిం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు రాత్రివేళల్లో కూడా మహిళలను పనిచేసేందుకు అనుమతించాయని సీఎస్ఐఎస్ తెలిపింది. ఇక్కడి ఫ్యాక్టరీలు, రిటైల్ కేంద్రాలు, ఐటీ కంపెనీల్లో రాత్రి వేళల్లోనూ మహిళలు విధులు నిర్వహిస్తూ, భద్రంగా ఇల్లు చేరుతున్నారని తెలిపింది. ఈ విషయంలో మహారాష్ట్ర పర్ ఫెక్ట్ స్కోరు సాధించడంలో విఫలమైందని, అక్కడ 10 గంటల వరకే మహిళలు పనిచేయడానికి అనుమతులు ఉన్నాయని గుర్తు చేసింది. తొమ్మిది రాష్ట్రాలు రాత్రి పనికి అనుమతించడం లేదని, పదిహేను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా ఔత్సాహికులకు ఎలాంటి ప్రోత్సాహక ప్యాకేజీలు, వారు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రమోషనల్ పాలసీలు లేవని వెల్లడించింది.

  • Loading...

More Telugu News