: అమెరికాకు మొదటి ముప్పు రష్యా...ఆ తరువాతే చైనా!: పెంటగాన్
అమెరికాకు తొలి ముప్పు రష్యాయేనని అమెరికా రక్షణ స్థావరం పెంటగాన్ వ్యూహాత్మక కమాండర్ జనరల్ జాన్ ఈ హేటన్ తెలిపారు. సమీప భవిష్యత్తులో అమెరికాతో ఢీ కొట్టగల సామర్థ్యం ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది రష్యాయేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాకి ఏయే దేశాలతో ముప్పు ఉంటుంది, ఏ దేశాలు అమెరికాతో హోరాహోరీ తలపడగలవు? అన్న విషయంపై ఆయన వాషింగ్టన్ లో మాట్లాడుతూ, తమను ఢీ కొట్టగలిగే దేశాల్లో అగ్రభాగాన రష్యా ఉంటుందని అన్నారు. దాని తరువాతి స్థానంలో చైనా నిలుస్తుందని ఆయన తెలిపారు. గత 20 ఏళ్లుగా తాను ఆ రెండు దేశాలను గమనిస్తున్నానని, ప్రపంచంలోని ఏ దేశాన్నైనా ఢీ కొట్టగల సైనిక విభాగాన్ని ఆ దేశాలు తయారు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు అమెరికాకు సవాల్ విసురుతున్నాయని ఆయన చెప్పారు. ఇరాన్ ను మిత్రదేశాలతో నియంత్రించగలుగుతున్నప్పటికీ ఉత్తర కొరియాను నిలువరించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. అసలు ఉత్తర కొరియా ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారెందుకు వరుసగా అణు క్షిపణులు, అణ్వాస్త్రాల పరీక్షలు చేస్తున్నారో అంతు చిక్కడం లేదని, మిసైల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం వెనుక కారణాలు ఎవరికీ బోధపడడం లేదని ఆయన తెలిపారు.