: బులెట్లు దూసుకొచ్చి తల్లి మెడను చీల్చినా... ప్రాణాలతో వున్న గర్భంలోని శిశువు... ఇదొక 'మిరాకిల్'!
ఇది నిజంగా అద్భుతం. 19 సంవత్సరాల యువతి గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించగా, ఆమె గర్భంలోని బిడ్డ ప్రాణాలతో ఉందని తెలుసుకున్న వైద్యులు బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన షికాగోలో జరిగింది. బియర్డ్ అనే గర్భవతి, ఓ కారులో మరో వ్యక్తితో కలసి వెళుతున్న సమయంలో, దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బులెట్లు బియర్డ్ మెడలోకి దూసుకుపోయాయి. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన తరువాత వైద్యులు పరిశీలించగా, ఆమె ఆరోనెల గర్భవతని, కడుపులో బిడ్డ ప్రాణాలతోనే ఉందని గమనించారు. వెంటనే ఆపరేషన్ తీసి పాపాయిని బయటకు తీశారు. తల్లి బతికుంటే డిసెంబర్ లో పుట్టాల్సిన బిడ్డ, ఆమె మరణించినా, ప్రాణాలతో ఉండి అద్భుతాన్ని చూపిందంటూ ఆమెకు 'మిరాకిల్' అని పేరు పెట్టారు.