: భాగ్యనగరిలో పరిస్థితి ఘోరం... రంగంలోకి 'డిజాస్టర్' టీమ్
ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. 40కిపైగా కాలనీలు వరద నీటిలో మునిగిపోగా, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ రంగంలోకి దిగింది. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చిన్న బోట్లను వినియోగిస్తున్నారు. 100కు పైగా అపార్టుమెంటుల సెల్లార్లలో నీరు నిండిపోగా, వేలాది వాహనాల్లోకి నీరు ప్రవేశించింది. ముఖ్యంగా కూకట్ పల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నం, సనత్ నగర్ ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాత్రి పదిన్నర గంటల నుంచి కురిసిన వర్షం తెల్లవారుఝామునకు తెరిపినిచ్చినప్పటికీ, లక్షలాది మందికి కనీసం పాల ప్యాకెట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఇబ్బందులు మరింతగా పెరిగాయి.