: హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక...భారీగా చేరుతున్న వరదనీరు
హైదరాబాదు నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు మాన్ సూన్ సిబ్బంది, విపత్తు నిర్వహణ అధికారులను అప్రమత్తం చేసింది. గత రాత్రి కురిసిన భారీ వర్షాల ధాటికి నాలాల ద్వారా నీరు హుస్సేన్ సాగర్ కు చేరుకుంటోంది. దీంతో హుస్సేన్ సాగర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీరు హుస్సేన్ సాగర్ లోకి వస్తుండగా, 1500 క్యూసెక్కుల నీటిని బయటకి విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ హుస్సేన్ సాగర్ పరిమితిని మించి నీరు వచ్చి చేరుతుండడంతో గాంధీనగర్, దోమల్ నగర్, అంబేద్కర్ నగర్, అరుంధతినగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, అంబర్ పటేల్ నగర్ వాసులు అప్రమత్తంగా వుండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.