: మరో మూడు గంటల వరకు ఎవరూ రోడ్లపైకి రావద్దు... 'రెయిన్ ఎమర్జెన్సీ'ని ప్రకటించిన జీహెచ్ఎంసీ

రెయిన్ ఎమర్జెన్సీ... వినడానికి కొత్తగా ఉన్న ఈ పదాన్ని జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్) ప్రయోగించింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జీహెచ్ఎంసీ రెయిన్ ఎమర్జెన్సీని ప్రకటించింది. నగరం అంతటా వర్షం కురిస్తే సుమారు 2 సెంటీ మీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షపు నీటిని మాత్రమే పీల్చుకునే అవకాశం హైదరాబాదులోని డ్రైనేజీ సిస్టమ్ కు ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అయితే నగరంలోని అత్యధిక ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకుపైగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సూచనలు చేస్తూ, వాహనదారులు రోడ్లపైకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. మరో మూడు గంటల వరకు ఎవరూ రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేయవద్దని, ఈ మూడు గంటలు భారీ వర్షం హైదరాబాదును ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.