: హైదరాబాదును ముంచెత్తిన భారీ వర్షం... చెరువులను తలపిస్తున్న రోడ్లు
హైదరాబాదును వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తలెత్తిన అల్పపీడనం భారీ వర్షాలకు కారణమవుతోంది. హైదరాబాదు శివార్లలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కూకట్ పల్లి, ఆల్వాల్ లో భారీ వర్షాలు పడ్డాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాదు జలమయమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రోడ్లపైకి భారీగా నీరు చేరుకుంది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాదు వ్యాప్తంగా వర్షం అత్యల్పం 3 సెంటీమీటర్లు కురవగా, ఎక్కువ ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాహనదారులు హైదరాబాదు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. ప్రధానంగా షాపూర్ నగర్, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టల్లో కేవలం రెండు గంటల్లోనే 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో ఊహించవచ్చు!