: పాడుబడ్డ పార్కులోని గాంధీ విగ్రహంలో 40 కేజీల బంగారం!
నిరుపయోగంగా వున్న ఓ పార్కులో దుమ్మూధూళిపట్టిన ఓ గాంధీ విగ్రహంలో పెద్ద మొత్తంలో బంగారం వున్నట్టు గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని పనరుతి జంక్షన్ లో ఓ పార్కు ఉంది. సుదీర్ఘ కాలం ఈ పార్కును ఎవరూ పట్టించుకోకపోవడంతో దానిలో చెట్లు ఏపుగా పెరిగాయి, వాటితోపాటు పిచ్చిమొక్కలు కూడా పెరిగాయి. అందులో దుమ్మూధూళి పట్టేసి శిథిలావస్థకు చేరిన గాంధీ విగ్రహం కూడా ఉంది. ఇటీవలి కాలంలో ఈ పార్కును పట్టించుకున్న నాతడు లేడు. అయితే, మున్సిపాల్టీ చైర్మన్ పనీర్ సెల్వం గాంధీ జయంతి నాటికి పార్కును ఉపయోగంలోకి తేవాలని భావించి. దాని అభివృద్ధి నిమిత్తం 30 లక్షల రూపాయలు కేటాయించారు. దీంతో అక్కడ పనులు ప్రారంభమయ్యాయి. పిచ్చిమొక్కలన్నీ తీసేసి, పార్కును బాగుచేసిన కార్మికులు దుమ్మధూళి నిండిన గాంధీ విగ్రహానికి రంగులు వేయాలని భావించి, దానిని శుభ్రం చేయడం ప్రారంభించారు. శుభ్రం చేస్తున్న కొద్దీ ఆ విగ్రహం చిత్రంగా మెరవడం ప్రారంభించింది. దీంతో వారు మున్సిపల్ చైర్మన్ కు విషయం వివరించడంతో ఆయన స్వర్ణకారులను రప్పించి, అది అలా మెరవడానికి కారణం తెలుసుకున్నారు. వారు చెప్పింది విని ఆయన నోరెళ్లబెట్టారు. ఎందుకంటే, ఆ విగ్రహం అరుదైన పంచలోహ విగ్రహం. సుమారు 200 కేజీల బరువు ఉంటుందని, అందులో సుమారు 40 కేజీల బంగారం ఉందని తెలిపారు. సుమారు 60 ఏళ్ల క్రితం తయారైన ఆ విగ్రహం కోట్లాది రూపాయల విలువైనదని తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, దానికి రక్షణగా సెక్యూరిటీని నియమించారు.