: రాత్రుళ్లు ప్రజలు మెలకువగా ఉండాలంటే అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయాలి: కేంద్ర సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు చేయడంలో కేంద్ర మంత్రులు రికార్డులు బద్దలు కొడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ కులస్తే సంచలన వ్యాఖ్యలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నయిన్ పూర్ జిల్లాలో పిప్రియో గ్రామంలో గోండు రాజులు శంకర్ షా, రఘునాథ్ షా సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫగన్ కులస్తే హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఛత్తీస్ గఢ్ నుంచి డ్యాన్సర్లను రప్పించి మరీ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. వీటిని ఆసక్తిగా తిలకించిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిలో ఇలాంటి డాన్సులు భాగమని, ప్రజలు కూడా వీటిని బాగా ఇష్టపడుతున్నారని అన్నారు. రాత్రుళ్లు ప్రజలు మెలకువగా ఉండాలంటే ఇలాంటి డ్యాన్స్ ప్రదర్శనలు అవసరమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొనడం విశేషం.