: చంద్రబాబు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, సోమాలియా దేశాలకు వెళ్లలేదు కాబట్టి బతికిపోయాం: చెవిరెడ్డి సెటైర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియంతృత్వ పోకడలకు పోతున్నారని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. గుంటూరులో సీఐడీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడుకి రాష్ట్ర ప్రజల వాస్తవ పరిస్థితి అర్థం కావడం లేదని అన్నారు. ఎంతసేపూ సింగపూర్, మలేషియా, జపాన్ దేశాల్లా ఏపీని మార్చేస్తానని చెబుతుంటారని, అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంకొద్దీ చంద్రబాబు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, సోమాలియా దేశాల్లో పర్యటించలేదని, ఒకవేళ ఆయన ఆ దేశాల్లో పర్యటించి ఉంటే ఆ దేశాల్లా ఏపీని మార్చేస్తానని అనేవారని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ సింగపూర్ లా చేస్తా అని సీఎం చెప్పడం వెనుక కారణం, అక్కడ గత 40 ఏళ్లుగా ప్రతిపక్షం అన్నదే లేదని భాస్కరరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది సాధ్యం కాదని చంద్రబాబు గుర్తించాలని ఆయన సూచించారు. నిరంకుశత్వం, నియంతృత్వ పోకడలతో ప్రతిపక్షాన్ని అణచివేస్తామంటే కుదరదని గుర్తించాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News