: అగ్రరాజ్యం సాయం కోరిన పాకిస్థాన్


భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు అమెరికా సాయాన్ని పాకిస్థాన్ కోరింది. న్యూయార్క్ లో జరుగుతున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ అయినట్లు పాక్ పత్రిక ‘డాన్’ ఆన్ లైన్ ఎడిషన్ లో పేర్కొంది. పాక్-భారత్ మధ్య రగులుతున్న సమస్యలను పరిష్కరించేందుకు అమెరికా ప్రభుత్వం, విదేశాంగ మంత్రి సహకరిస్తారని తాను భావిస్తున్నట్లు షరీఫ్ పేర్కొన్నట్లు డాన్ పేర్కొంది. ఉగ్రవాదంపై పాక్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉందని, పొరుగు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు షరీఫ్ పేర్కొన్నట్లు ఆ పత్రిక కథనం. పాక్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కాపాడతామని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గతంలో చేసిన వాగ్దానాన్ని ఈ సందర్భంగా షరీఫ్ ప్రస్తావించినట్లు సమాచారం. కాగా, యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ నిన్న న్యూయార్క్ చేరుకున్నారు. ఈ సమావేశంలో షరీఫ్ రేపు ప్రసంగించనున్నారు. ప్రముఖంగా జమ్మూకాశ్మీర్ అంశంపైనే ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News