: కొత్తమలుపు తిరగనున్న జియాఖాన్ ఆత్మహత్య కేసు
బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన కుమార్తెది ఆత్మహత్య కాదు, హత్య అని బలంగా వాదిస్తున్న జియా ఖాన్ తల్లి రబియా అమీన్ సరికొత్త సాక్ష్యాలతో బాంబే హైకోర్టు గడపతొక్కనున్నారు. జియా ఖాన్ ఆత్మహత్య అనంతరం న్యాయస్థానానికి సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టులో ఆమె కింది పెదవిపై బలమైన గాయం ఉంది. ఉరివేసుకున్నాక ఊపిరి ఆడని స్థితిలో ఆమే తన పెదవిని కొరుక్కొని ఉంటుందని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. అలాగే జియా ఖాన్ మెడపై, కింది దవడల వద్ద మచ్చలు కనిపించాయి. ఇవి చున్నీతో ఉరి వేసుకోవడం వల్ల ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీంతో జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని డిఫెన్స్ వాదించింది. దీంతోనే ఈ కేసులో ప్రదాన నిందితుడు సూరజ్ పంచోలీకి బెయిల్ లభించింది. దీంతో విభేదించిన జియా ఖాన్ తల్లి రబియా అమీన్ అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ నిపుణులతో రిపోర్టు తయారు చేయించారు. ఇందులో ముంబై పోలీసుల వాదనతో ఏకీభవించని వారు, ముంబై పోలీసుల వాదనను తప్పుపట్టారు. జియా ఖాన్ ది ఆత్మహత్య కాదు హత్యే అయి ఉండొచ్చని లండన్ కు చెందిన జేసన్ పేన్ జేమ్స్ ఫోరెన్సిక్ సంస్థ వాదిస్తోంది. జియా ఖాన్ కింది పెదవిపై అయిన గాయాలు ఆమెపై బలమైన ఒత్తిడి పడడం వల్లే అయ్యాయని ఈ రిపోర్టు చెబుతోంది. జియా ఖాన్ మెడ, దవడలపై కనిపించిన గాయాలు చున్నీ కారణంగా అయినవి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ రూపొందించిన రిపోర్టును జియా తల్లి రబియా అమిన్ రేపు బాంబే హైకోర్టులో దాఖలు చేయనున్నారు. దీంతో దాదాపు విచారణ పూర్తికావచ్చిన ఈ కేసు కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది.