: మీ వల్ల మమ్మల్ని తిడుతున్నారు: నగర రోడ్ల దుస్థితిపై అధికారులకు కేటీఆర్ క్లాస్!
హైదరాబాద్ లోని రహదార్ల పరిస్థితిపై జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్, వారి వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నాసిరకం పనుల కారణంగానే వర్షాలకు రహదారులు చెడిపోతున్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రోడ్ల దుస్థితికి కారణం అధికారుల అవినీతో, కాంట్రాక్టర్ల నాసిరకం పనులో తనకు తెలుసునని, కొందరు అధికారుల అవినీతి కారణంగా ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని ఇంజనీరింగ్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారుల పనితీరు బాగాలేదని, ఇలాంటి పరిస్థితిని సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా అసమర్థతను ఒప్పుకొని సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలని సూచించారు. వర్షం వల్ల రహదారులకు గుంతలు పడి ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని, ట్రాఫిక్ లో గంటల కొద్దీ చిక్కుకుపోతున్నారని గుర్తు చేసిన కేటీఆర్, జీహెచ్ఎంసీ యంత్రాంగమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులకు కదలాలని ఆదేశించారు. ఈ సమీక్షకు మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.