: చిత్తూరు సెక్స్ రాకెట్ నిందితుడు చెప్పిన వాస్తవాలు... షాక్ తిన్న పోలీసులు!


చిత్తూరు సెక్స్ రాకెట్ లో పోలీసులు నిర్ఘాంతపోయే నిజాలను నిందితుడు విచారణలో వెల్లడించాడు. చిత్తూరులోని సత్యవేడులో ఓ మహిళ గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సెక్స్ రాకెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి తీగ లాగిన పోలీసులకు డొంక కదలడం కనిపించింది. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేయగా వారు షాక్ తినే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆ మహిళ ఫిర్యాదుతో చెన్నైలోని రఫీ, పాండియన్ అనే ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో కస్టడీకి అప్పగించింది. దీంతో విచారించిన పోలీసులకు తాను ఒక్కడ్నే 90 మంది మహిళలను విదేశాల్లో వ్యభిచార గృహాలకు విక్రయించినట్టు అతను వెల్లడించడంతో ఆశ్చర్యపోయారు. ఇందుకోసం చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలువుర్ని ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వీరి పని ఏంటంటే... తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు, ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లాలనుకుంటున్న యువతులను గుర్తించడమే! వారి అవసరాన్ని గుర్తించి, విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, అక్కడికి వెళ్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా మరింత డబ్బు సంపాదించుకోవచ్చని, మళ్లీ ఇక్కడికి వచ్చి దర్జాగా బతకవచ్చని మాటల కోటలు కట్టడమే. అలా ఇంత వరకు తాను 90 మందిని విదేశాలకు ఉద్యోగాల పేరుతో పంపానని, వారందర్నీ మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాల్లోని వ్యభిచార గృహాలకు అమ్మేశానని తెలిపాడు. దీంతో రఫీ పంపిన వారి వివరాలు పాస్ పోర్టు కార్యాలయాల్లోంచి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ లో ఎలాగయితే కూలీలు, మేస్త్రీలు, పైలెట్‌ లు, జిల్లా, అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్ర, జాతీయ, విదేశీ స్మగ్లర్లు ఉన్నారో అదే తరహాలో మహిళల అక్రమ రవాణా కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News