: పెళ్లిలో చూసిన అమ్మాయిని వలచి, వరించలేక విలన్ గా మారి కటకటాల వెనక్కి!


ఓ వివాహానికి వెళ్లి అక్కడో అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, ఆపై వారింట్లో వాళ్లకు దగ్గరై, మెప్పు పొంది ఆమెను దక్కించుకునేందుకు పాట్లు పడటం ఎన్నో సినిమాల్లో చూసిన కథే. ఇక్కడ మాత్రం కథ కాస్త మారింది. తనకు నచ్చిన అమ్మాయి దక్కదని తెలియడంతో, విలన్ గా మారి ఆమె అక్క కొడుకును కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కయ్యాడో యువకుడు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బీహార్ కు చెందిన పింతూ కుమార్, ఓ పెళ్లి వేడుకలో ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆమె కుటుంబం ఢిల్లీకి వెళితే, అక్కడికీ వెళ్లి మకాం పెట్టాడు. ఆ అమ్మాయి బావతో స్నేహం చేశాడు. అలా ఇంట్లో వాళ్లకు దగ్గరయ్యాడు. యువతి సోదరితోనూ మంచివాడిలా మాటలు కలిపాడు. ఆపై తాను ప్రేమిస్తున్న విషయం చెప్పాడు. అయితే, నిరుద్యోగిగా ఉన్న పింతూకు పిల్లనిచ్చేందుకు ఆ కుటుంబం అంగీకరించలేదు. అప్పుడు అతనిలోని కర్కశత్వం బయటపడింది. వాళ్లింట్లోని ఆరేళ్ల బాలుడిని తీసుకుని బీహార్ వెళ్లిపోయాడు. అమ్మాయితో పెళ్లి జరిపిస్తేనే బాబును ఇస్తానని బెదిరించాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించగా, ఓ ప్లాన్ ప్రకారం వారు పింతూను అరెస్ట్ చేసి, బాలుడిని క్షేమంగా ఇంటికి చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News