: జనగామ జనగర్జన సభలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం

తెలంగాణలో దసరాలోపే కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని ప్రభుత్వం భావిస్తుండగా తమ ప్రాంతాన్ని జిల్లాలుగా ప్రకటించాలని పలు ప్రాంత వాసులు చేస్తోన్న ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. వరంగల్ జిల్లా జనగామలో ప్రజలు తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని జనగర్జన పేరుతో ఈరోజు సభను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, సీపీఎం ఎమ్మెల‌్యే సున్నం రాజయ్య ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం సభకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వేదికపై మాట్లాడడానికి ప్రయత్నించారు. అయితే, ప్రసంగం చేయొద్దంటూ, ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. ఆయనను అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.