: మీ లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఇలా వుంటుంది!


ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్న అక్రమార్కులను అడ్డుకునేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ ప్రతి పెద్ద ట్రాన్సాక్షన్ పైనా కన్నేసింది. ప్రజలు బ్యాంకుల్లో చేసే ప్రతి లావాదేవీపై ఐటీ శాఖ కన్నేసింది. బీమా నిమిత్తం కడుతున్న ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు వాడకం తదితరాలన్నింటిపైనా నిఘా పెట్టింది. ఇక తమకు రావాల్సిన పన్ను ఎగ్గొడుతున్న వారిని గుర్తించేందుకు ఐటీ అధికారుల ముందున్న మార్గాలివి. * ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినా, డీడీ తీసినా, ఫిక్సెడ్ చేసినా ఆ సమాచారాన్ని మీ బ్యాంకే స్వయంగా ఐటీ శాఖకు అందిస్తుంది. * రూ. 30 లక్షల కన్నా విలువైన స్థిరాస్తి లావాదేవీలో పాల్గొంటే రిజిస్ట్రార్ స్వయంగా విషయాన్ని తెలియజేస్తారు. * మీ క్రెడిట్ కార్డు పెండింగ్ బిల్లులో రూ. 1 లక్షను ఒకేసారి చెల్లించినా, ఓ ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలను కట్టినా, మీ కార్డు కంపెనీయే స్వయంగా పన్ను అధికారులకు విషయాన్ని చేరవేస్తుంది. * రూ. 10 లక్షల కన్నా విలువైన షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తే, ఆయా కంపెనీలే టాక్స్ విభాగానికి సమాచారం చెబుతాయి. * సంవత్సరానికి రూ. 50 లక్షలకన్నా అధికంగా సంపాదిస్తుంటే ఈ సంవత్సరం నుంచి కొత్త ఐటీఆర్ (ఇన్ కం టాక్స్ రిటర్న్) ఫాంను నింపాల్సి వుంటుంది. * రూ. 2 లక్షల కన్నా అధిక విలువైన లావాదేవీ జరిపితే పాన్ సంఖ్య తప్పనిసరి. * ఫిక్సెడ్ డిపాజిట్లపై ఓ సంవత్సరంలో వడ్డీ రూ. 10 వేలను దాటితే, బ్యాంకులు దానిపై టీడీఎస్ వసూలు చేస్తాయి. ఇలా టీడీఎస్ వసూలు చేసిన ఖాతాదారుల వివరాలను ఆదాయపు పన్ను అధికారులకు చేరవేస్తుంది. * ఇక రూ. 10 లక్షల కన్నా విలువైన కారు కొన్న కస్టమర్ల నుంచి 1 శాతం లగ్జరీ టాక్స్ వసూలు చేసే అమ్మకందారు ఆ విషయాన్ని ఐటీ శాఖకు తప్పనిసరిగా చెప్పాలి. * వీటన్నింటితో పాటు మీ పాన్ కార్డు సంఖ్యతోనే అన్ని వివరాలూ ఐటీ శాఖకు తెలిసిపోతాయి. ఎందుకంటే, ద్విచక్ర వాహనాలు మినహా ఏ ఇతర వాహనం అమ్మినా, కొన్నా, డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలన్నా, క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేయాలన్నా, రూ. 50 వేలకు మించి ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలన్నా, బీమా ప్రీమియం కింద రూ. 50 వేలను మించి చెల్లించాలన్నా, రెస్టారెంట్, విదేశీ ప్రయాణాల నిమిత్తం రూ. 50 వేలకు మించి ఖర్చు పెట్టినా, బ్యాంకులో రూ. 50 వేలకు మించి నగదును డిపాజిట్ చేస్తున్నా పాన్ నెంబర్ తెలపడం తప్పనిసరి.

  • Loading...

More Telugu News