: సీఐడీ విచారణకు హాజరైన భూమన.. చంద్రబాబు లాంటి అరాచక శక్తి మరొకటి లేదని వ్యాఖ్య

కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో తునిలో నిర్వహించిన కాపుల బహిరంగసభ కారణంగా చోటు చేసుకున్న విధ్వంసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి గుంటూరులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సీఐడీ కార్యాలయంవద్ద ఈరోజు 144 సెక్షన్ విధించారు. ఈ సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడతో మాట్లాడడం తాను చేసిన నేరమా? అని ప్రశ్నించారు. తనకు, తుని విధ్వంసం ఘటనకు ఎటువంటి సంబంధమూ లేదని భూమన అన్నారు. చంద్రబాబు లాంటి అరాచక శక్తి మరొకటి లేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కాపు ఉద్యమంలో ఇకపై తాను ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పారు. ఈ కేసులో భూమనను ఇప్పటికే ఈనెల 6, 7 తేదీల్లో సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరిన్ని విషయాలను రాబట్టడానికి సీఐడీ అధికారులు ఈరోజు ఆయనను ప్రశ్నిస్తున్నారు.