: మహిళలకు చంద్రబాబు ఆరోగ్య కానుక... 'ఎంఎంహెచ్సీ - 35+'
ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కానుకను ప్రకటించారు. 'ఎంఎంహెచ్సీ - 35+' (మహిళా మాస్టర్ హెల్త్ చెకప్) పేరిట 35 సంవత్సరాలు దాటిన మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేసే పథకాన్ని ప్రారంభించారు. ఈ ఉదయం విజయవాడలో ఆర్డీఓలు, డీఎస్పీలు ఇతర అధికారులతో సమావేశమైన ఆయన, ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మహిళలకు ఖరీదైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ పరీక్షలతో పాటు కంటి పరీక్షలు, హార్మోన్ల పరీక్షలతో పాటు సాధారణ బీపీ, మధుమేహ పరీక్షలను ఉచితంగా జరిపిస్తామని తెలిపారు. 35 ఏళ్లు నిండిన ప్రతి మహిళా ఈ పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవడం ద్వారా రాబోయే అనారోగ్య సమస్యలను ముందే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.