: ఇక మొబైల్ కనెక్షన్ 2 నిమిషాల్లోనే.. ఈ-కేవైసీ విధానానికి టెలికం కంపెనీల శ్రీకారం
సిమ్‌కార్డు యాక్టివేషన్ కోసం ఇక రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. ఇక నుంచి రెండంటే రెండు నిమిషాల్లోనే సిమ్ ఎంచక్కా యాక్టివేట్ అయిపోతుంది. ఇందుకోసం టెలికం కంపెనీలు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. ఎయిర్టెల్, రిలయన్స్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఈ విధానాన్ని అమల్లో పెట్టాయి. దీంతో ధ్రువపత్రాలను కస్టమర్లు ఇక వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు. కేవలం ఆధార్‌కార్డును తీసుకెళ్తే 2 నిమిషాల్లోనే సిమ్ యాక్టివేట్ చేస్తారు. ఔట్లెట్లలో ఉన్న సిబ్బందికి ఆధార్ కార్డు ఇవ్వగానే వారి వద్ద ఉన్న ప్రత్యేక ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్ఫోన్లలో ఆధార్ నంబరును టైప్ చేస్తారు. ఆ వెంటనే వినియోగదారుడి వివరాలు ప్రత్యక్షమవుతాయి. దీంతో మరో పరికరంలో కస్టమర్ వేలిముద్రలను సిబ్బంది తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియకు రెండు నుంచి మూడు నిమిషాల సమయం పడుతుంది. ఈ విధానంలో సిమ్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉండదు. ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా ఉండడంతో సిమ్‌లు పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండదని కంపెనీలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ-కేవైసీ వల్ల పనిభారం చాలా వరకు తగ్గిపోతుందని చెబుతున్నాయి. సరికొత్త విధానం వల్ల వచ్చే ఐదేళ్లలో టెలికం కంపెనీలకు రూ.10వేల కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న పద్ధతిలో ప్రతి కనెక్షన్‌కు టెలికం కంపెనీలు మెట్రో నగరాల్లో రూ.145-175 వరకు ఖర్చు చేస్తున్నాయి. ఈ-కేవైసీ ద్వారా ఇవి ఆదా అవుతాయి.