: పాకిస్థాన్ ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ చీఫ్ జస్టిస్
యూరీ సెక్టార్ పై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ... అచ్చం భారత్ లా పాకిస్థాన్ లో నెలకొన్న ఉగ్రవాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ అన్వర్ జహీర్ జమాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ లో ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ లోని కొన్ని రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నాయని అన్నారు. దీంతో న్యాయవ్యస్థను చేతుల్లోకి తెచ్చుకునేందుకు జడ్జీలు, న్యాయవాదుల్లో భయాన్ని కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పాక్ అంతర్గత ప్రయోజనాల దృష్ట్యా ఉగ్రవాదం వృద్ధి చెందుతోందని ఆయన స్పష్టం చేశారు. పాక్ సుస్థిరంగా ఉండాలంటే ఉగ్రవాదంపై ఆధారపడడం కాకుండా, ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎంతసేపూ ఉగ్రవాదంపై భారత్ చేసే ఆరోపణలపై దుమ్మెత్తిపోసే పాక్ తమ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.