: మోదీ సెల్ఫీ, ప్రామెసింగ్ మెషీన్: రాహుల్ ఎద్దేవా
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గర్వంగా ప్రకటించిన రైతులకు గిట్టుబాటు ధరలు, 15 లక్షల డిపాజిట్, రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లోని డియోరియా నియోజకవర్గంలో కిసాన్ మహాయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ఓ సెల్ఫీ, ప్రామిస్ లు చేసే మెషీన్ అని ఎద్దేవా చేశారు. ప్రధాని చెప్పే అఛ్చేదిన్ కేవలం ఆయన పారిశ్రామిక స్నేహితుల కోసం మాత్రమేనని, దేశ ప్రజల కోసం కాదని ఆయన ఆరోపించారు. కిసాన్ యాత్రలో భాగంగా మందిరాలు, మసీదులను సమానంగా దర్శించానని అన్నారు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ తదితర మతాలకు చెందిన వారితో ప్రశాంతంగా ఉండే భారతదేశంలో లేనిపోని వివాదాల పేరుతో మతాల మధ్య చిచ్చురేపుతున్నారని ఆయన బీజేపీని విమర్శించారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో లేని గొడవలు, వివాదాలు మోదీ అధికారంలోకి రాగానే ప్రారంభమయ్యాయని ఆయన మండిపడ్డారు. 9 వేల కోట్లు దోచుకున్న విజయ్ మాల్యా విదేశాల్లో హాయిగా ఉంటే...దేశంలో పేద రైతులను మాత్రం దొంగల్లా చూస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాట్లు, పటేళ్లు, ఇతరులకు మధ్య వివాదాలు నెలకొన్నాయని ఆయన గుర్తుచేశారు.