: అధికారుల వేధింపులు భరించలేక వీఆర్వో ఆత్మహత్యాయత్నం
అధికారుల వేధింపులు తాళలేక ఒక వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం, తాడ్వాయి మండలం వెరాపహాడ్ గ్రామానికి చెందిన బోండ్ల భూపతి గతంలో గ్రామ సేవకుడిగా పనిచేశాడు. 2004లో వీఆర్వోగా పదోన్నతి పొంది బిచ్కుంద మండలానికి బదిలీపై వెళ్లాడు. అయితే, తాను పనిచేసే గ్రామానికి, స్వగ్రామానికి చాలా దూరం ఉంది. దీంతో, తన స్వగ్రామానికి దగ్గర్లో ఉన్న గ్రామానికి తనను బదిలీ చేయాలని ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో, మనస్తాపం చెందిన భూపతి, 5 నెలలుగా తన విధులకు హాజరుకావట్లేదు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కు తన వినతిని విన్నవించేందుకని ఈరోజు కలెక్టరేట్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లే సమయంలో భూపతి తన వెంట పురుగుల మందు డబ్బా కూడా తీసుకువెళ్లాడు. కలెక్టరేట్ ఎదుట నిలబడి ఆ పురుగుల మందును తాగాడు. అక్కడున్న వారు ఇది గమనించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అతన్ని హైదరాబాద్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. భూపతి జేబులో నాలుగు పేజీల సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.