: ‘ప్రత్యూష’ నిధుల కోసం... ప్రముఖ చిత్రాల్లో స్టార్లు వాడిన వస్తువులను వేలం వేస్తా: సమంత
దక్షిణాది ముద్దుగుమ్మ సమంత తన కెరీర్ పైనే కాకుండా సేవా దృక్ఫథంపై కూడా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎవరైతే అనారోగ్యం బారిన పడి, వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉంటారో వారిని సమంత వెన్నంటి నిలుస్తోంది. తన స్వచ్ఛంద సంస్థ ‘ప్రత్యూష’ ద్వారా పలువురికి చేయూత నిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ప్రత్యూష’ కు నిధులు పెంచుకునే పనిలో పడింది. ఇందుకుగాను, పలువురు ప్రముఖ నటులు నటించిన చిత్రాల్లో వారు ఉపయోగించిన వస్తువులకు వేలం పాట నిర్వహించనుంది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ఖాతా తెలిపింది. ఈ వేలం పాటకు సంబంధించిన వివరాలను త్వరలోనే వివరిస్తానని చెప్పింది. ఈ వేలం పాట ద్వారా తన సంస్థకు నిధులు సమకూరతాయని, తమ అభిమాన నటులు వాడిన వస్తువులను సొంతం చేసుకున్నామన్న తృప్తి అభిమానులకు ఉంటుందనే విషయాన్ని ఈ ట్వీట్ల ద్వారా సమంత చెప్పింది. కాగా, ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కల్యాణ్ ధరించిన ఖాకీ డ్రెస్సు కూడా ఈ వేలం పాటలో ఉంటుందని తెలుస్తోంది.