: 'కొడుకు పెళ్లి' పిట్టకథ చెప్పి చంద్రబాబును నవ్వించిన వెంకయ్యనాయుడు


ఈ ఉదయం కృష్ణా జిల్లా నెమ్మలూరులో బెల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన వేళ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో కాంగ్రెస్ ను ఎద్దేవా చేస్తూ 'కొడుకు పెళ్లి' పిట్టకథను చెప్పి చంద్రబాబు సహా వేదికపై ఉన్న వారిని, ప్రజలను నవ్వించారు. 50 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న తమకు ప్రజలు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారని, కాంగ్రెస్ వారు 2019 వరకూ ఆగాలని హితవు పలికిన ఆయన "వెనకటికి ఒకాయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి చేయాలని తండ్రి వద్ద గొడవ పెడుతున్నాడు. వాళ్ల నాయన అప్పుడే టైం కాలేదురా, వద్దురా తొందర పడమాకురా అన్నాడట. లేదు నాకు తొందరగా పెళ్లి కావాలి అంటూ ఊళ్లో వాళ్లందరికీ చెప్పాడట వెళ్లి... అయ్యా మా నాయిన నేను చెబితే పెళ్లి చేయడం లేదు. తొందరగా నాకు పెళ్లి అయ్యేట్టు చూడమని. ఆపై ఊళ్లో వాళందరూ వెళ్లి చెప్పారట. మీ అబ్బాయికి అంత హుషారుగా ఉంటే తొందరగా పెళ్లి చేయవయ్యా అని. దీంతో వాడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తరువాత రెండేళ్లయిపోయింది. ఏం కాలేదు. మూడేళ్లయింది ఏం కాలేదు... (ఈ సమయంలో చంద్రబాబు, ఆయన పక్కనున్న సుజనా చౌదరి నవ్వాపుకోలేకపోయారు) ఐదేళ్లయింది ఏం కాలేదు. పదేళ్లయింది ఏం కాలేదు. ఏందిరా అంత గొడవ జేస్తివి, మీ నాయన ప్రాణం తీస్తివి? పదేళ్లయినా ఇంకా ఏం కాలేదంటే ఎలారా? అంటే నాకు ఇంకో చాన్సిచ్చి చూడండి, ఈ సారి చూపిస్తా నా తడాఖా అన్నాడట" అంటూ నవ్వించారు. 'ఇప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులంతా, ఆ కేటగిరీకి చెందిన వాళ్లే. అర్థం చేసుకోండి' అన్నారు వెంకయ్య.

  • Loading...

More Telugu News