: ఆగ్రహంతో అల్లకల్లోలం... అకారణంగా 70 కార్ల అద్దాలు ధ్వంసం
ఆవేశంలో విచక్షణ కోల్పోయిన కొంత మంది స్థానికులు చేసిన రభసకు 70 కార్ల అద్దాలు అకారణంగా ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... నేటి ఉదయం తెల్లవారు జామున 2:55 నిమిషాలకు దక్షిణ కోల్ కతాలోని హజ్రా ఏరియాలో స్కూటీపై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా, వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూకారు వారిని ఢీ కొట్టింది. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 24 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సుమారు వంద మంది దగ్గర్లోని ఒయాసిస్ అపార్ట్ మెంట్ లో నిందితుడు దాక్కున్నాడని భావించి, అక్కడికి చేరుకుని నిందితుడు బయటకి రావాలని కేకలు వేశారు. ఎంత సేపటికీ నిందితుడు వారికి కనిపించకపోవడంతో అపార్లమెంట్ వాసులకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. అలా సుమారు 70 కార్ల అద్దాలు పగులగొట్టారు. అడ్డం వచ్చిన వారిపై దాడి చేశారు. కార్లపై పెట్రోలు పోసి తగులబెడుతుండగా, నిందితుడు ఆ అపార్లమెంటుకు చెందిన వాడు కాదు అని తెలిసింది. దీనికి తోడు అదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడి నుంచి ఆందోళనకారులు వెళ్లిపోయారు.