: ఇకపై లింగనిర్ధారణ ప్రకటనలను నిలిపివేయనున్న సెర్చ్ ఇంజన్లు


పుట్టబోయే బిడ్డ మగ, ఆడో తెలుసుకునేందుకుగాను వైద్యులు చేసే లింగనిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సమాచారం, ప్రకటనలు సెర్చ్ ఇంజిన్లలో ఇకపై ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ తరహా ప్రకటనలను ఆయా సెర్చ్ ఇంజిన్లు త్వరలోనే నిలిపివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ లాంటి ప్రముఖ సెర్చ్ ఇంజిన్లు లింగనిర్ధారణకు సంబంధించిన ప్రకటనలను, క్లినిక్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సాబుమాథ్యూ జార్జ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. దీనిపై గత జులైలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, ఈ ప్రకటనలు ఆయా సెర్చ్ ఇంజన్లలో పూర్తిగా ఆగిపోయేలా చేయలేరా? అంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయా సెర్చ్ ఇంజిన్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం చర్చించింది. లింగ నిర్ధారణ ప్రకటనలు త్వరలోనే ఆగిపోతాయని, ఇందుకోసం ఒక ప్రత్యేక ఆటో బ్లాక్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లింగనిర్ధారణ సమాచారం నిమిత్తం వెతికే 22 కీ వర్డ్స్ ను గుర్తించామని తెలిపింది. ఆ పదాలతో వెతికితే యూజర్లకు ఎటువంటి సమాచారం నెట్ లో లభ్యం కాదని ఆయా సెర్చ్ ఇంజిన్ సంస్థలు తెలిపాయి.

  • Loading...

More Telugu News