: రోడ్ల దుస్థితిపై నిరసన తెలుపుతున్న రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లోని రోడ్ల పరిస్థితిపై టీటీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈరోజు నగరంలోని ఎల్లారెడ్డిగూడలో టీటీడీపీ రేవంత్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి గుంతలు పడిన రోడ్లపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి పోలీసులతో మాట్లాడుతూ... గుంతలు పూడ్చమంటే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో తమపై దాడి చేయించవచ్చు కానీ, తమ పోరాటాన్ని మాత్రం ఆపలేరని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. రోడ్ల దుస్థితితో ట్రాఫిక్ జాం ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతోందని, అయినా సౌకర్యాలు మాత్రం లేవని ఆయన పేర్కొన్నారు. పోలీసులను ప్రయోగించి తమని ఆపలేరని ఉద్ఘాటించారు. ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేరోజులు వస్తాయని అన్నారు.