: పాక్ పై యాక్షన్ ప్లాన్ ఇది!
ఈ ఉదయం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ మంత్రులు, రక్షణ శాఖ అధికారులు, పాకిస్థాన్ పై ఎదురుదాడికి సిద్ధమన్న సంకేతాలను పంపాలని నిర్ణయించారు. పాక్ కు బుద్ధి చెప్పే దిశగా అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ పై వీరి మధ్య గంటన్నర పాటు కీలక చర్చలు జరుగగా, యూరీపై దాడులు, సరిహద్దుల్లో భద్రత, సీమాంతర దాడులకు ఉన్న అవకాశాలు తదితరాలను చర్చించినట్టు తెలుస్తోంది. తొలుత ఐక్యరాజ్యసమితిలో పాక్ దుర్మార్గాలను ఎండగట్టాలని, అందుకు ఈ నెల 26ను ముహూర్తంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. యూఎన్ఓలో సుష్మాస్వరాజ్ ప్రసంగం, ప్రధానంగా యూరీ సెక్టారుపై దాడి, ఉగ్రవాదులకు పాక్ ఇస్తున్న మద్దతుపైనే ఉండాలని ప్రధాని సూచించినట్టు సమాచారం. ఇక ఈ దాడి నేపథ్యంలో పాక్ లో నవంబరులో జరిగే సార్క్ సదస్సుకు గైర్హాజరు కావడం ద్వారా ద్వైపాక్షిక ఒత్తిడిని పెంచాలని కూడా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.