: బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పొరుగున 1993 ముంబై పేలుళ్ల నిందితుడు... 23 ఏళ్ల తరువాత పట్టుబడ్డ అబ్దుల్ సత్తార్
1993 నాటి ముంబై బాంబు దాడుల్లో ఆర్డీఎక్స్ ను సరఫరా చేసిన కీలక నిందితుడు అబ్దుల్ సత్తార్ బట్లీవాలాను ఎట్టకేలకు గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్ట్ చేసింది. బాంబు దాడుల తరువాత అదృశ్యమైపోయిన అబ్దుల్ సత్తార్, 23 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతను ఎక్కడున్నాడో తెలియక పోలీసులు వెతుకులాటను కూడా నిలిపివేశారు. ముంబైలో ప్రముఖులు, సెలబ్రిటీలు అధికంగా నివసించే బాంద్రా వెస్ట్ కాలనీలో తలదాచుకున్న అబ్దుల్ సత్తార్ ఇరుగు పొరుగున బాలీవుడ్ నటీనటులతో పాటు, ఓ క్రికెటర్ కూడా ఉండటం విశేషం. కాగా, గోసాబారా ఆయుధాల కేసుతో పాటు ఆర్డీఎక్స్ సరఫరా వెనుక సత్తార్ హస్తముందని చెప్పిన ఏటీఎస్ అధికారులు, ముంబై దాడులకు ముందు దావూద్ ఇబ్రహీంను దుబాయ్ లో కలిసి చర్చలు జరిపి వచ్చాడని వివరించారు. ఏటీఎస్ ఎస్పీ హిమాంషు శుక్లా, డీఎస్పీ బీజే చావ్డాల నేతృత్వంలోని బృందం సత్తార్ ఎక్కడ తలదాచుకున్నాడన్న విషయమై నిఘా పెట్టిందని, ఆపై ఆనుపానులు పసిగట్టి ముంబై వెళ్లి అరెస్ట్ చేసిందని గుజరాత్ ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ ఐఎస్ఐ సాయంతో పేలుడు పదార్థాలను ఇండియాకు తెచ్చిన సత్తార్, బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత, ముంబైలో అల్లర్లు జరుగుతున్నప్పుడు దుబాయ్ లో ఉన్నాడని తెలిపారు.