: ఆ సినిమాను 2115లో విడుదల చేస్తారట.. సినిమా రీల్ ను లాకర్‌లో పెట్టి టైం సెట్ చేసి మరీ ఉంచారు!
సాధారణంగా సినిమాలు ఎంత వీలయితే అంత తొందరగా చిత్రీకరణ పూర్తి చేసి, విడుదల చేయాలని అనుకుంటారు. సినీ హీరోల అభిమానులు తమ హీరో సినిమాను చూసేందుకు కాలవ్యవధి తక్కువగా ఉండాలని కోరుకుంటారు. టాలీవుడ్ సినిమాలు అనుకున్న గడువులోగా పూర్తికాక సినిమాను నెల, రెండు నెలలు అంటూ వాయిదా వేసి ఆ తరువాత విడుదల చేస్తారు. బాలీవుడ్ సినిమాలు ఆరు నెలల నుంచి సంవత్సరం, రెండు సంవత్సరాలలోపు సినిమా తీయాలని నిర్ణయించుకొని సినిమా ప్రారంభ షాట్ పడకముందే విడుదల తేదీలను ప్రకటిస్తాయి. హాలీవుడ్‌లోనూ ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే, ఓ హాలీవుడ్ సినిమాను తీయాలనుకుంటున్న చిత్రం టీమ్ దానిని విడుదల చేయనున్న తేదీని ప్రకటించింది. ఆ సినిమా విడుదల తేదీ గురించి వింటే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, ఆ సినిమాని వంద ఏళ్ల తరువాత విడుదల చేస్తారట. హాలీవుడ్ దర్శకుడు రాబర్ట్ రోడ్రిగే ‘100 ఇయర్స్: ద మూవీ యు విల్ నెవర్ సీ’ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ చిత్ర బృందం తమ చిత్రాన్ని 2115వ సంవత్సరం నవంబర్ 18వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కథా రచయిత జాన్ మాల్కొవిచ్ ఈ సినిమాకి స్టోరిని అందించి, అందులో పాత్ర కూడా పోషిస్తున్నాడు. లూయి-8 కాగ్నక్ అనే మద్యపాన తయారీ సంస్థ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అప్పటివరకూ సదరు సినిమా పైరసీ బారిన పడకుండా కూడా ఎన్నో ఏర్పాట్లు చేశారు. సినిమా కథను కొంచం కూడా చెప్పకుండా జాగ్రత్తపడుతున్నారు. సినిమా రీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య దాచి ఉంచారు. రీల్‌ను బుల్లెట్ ప్రూఫ్ లాకర్‌లో పెట్టారు. సినిమా విడుదల తేదీ అయిన 18 నవంబర్ 2115 తేదీన మాత్రమే ఆటోమెటిక్‌గా తెరుచుకునేలా లాకర్‌కు టైం సెట్ చేసి మరీ ఉంచారు. ఈ సినిమా ప్రీమియర్ షోకి వెయ్యి మందికి వెల్‌కమ్ చెబుతారట. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను 2015 నవంబరులోనే విడుదల చేశారు. ఇప్పుడున్న వారెవరూ ఆ సినిమాని చూసే అవకాశం లేదన్న సంగతి మనకు తెలిసిందే. దానికి అనుగుణంగానే ఈ సినిమాకు ‘ద మూవీ యూ నెవర్ సీ’ అని ట్యాగ్‌లైను పెట్టారు.