: ఎన్నికల్లో గెలుపునకు హిల్లరీ క్లింటన్ వ్యూహకర్తలను ఆశ్రయించిన అఖిలేష్ యాదవ్!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిశోర్ ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడంతో, సీఎం అఖిలేష్ యాదవ్, ప్రస్తుతం హిల్లరీ క్లింటన్ కు ప్రచారంలో సహకరిస్తూ, రాజకీయ వ్యూహాలను పన్నుతున్న హార్వార్డ్ యూనివర్శిటీ పొలిటికల్ కన్సల్టెంట్ స్టీవ్ జార్డింగ్ తో డీల్ కుదుర్చుకున్నారు. ప్రచారం జరుగుతున్న తీరును పరిశీలించేందుకు లక్నో వచ్చిన ఆయన ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇక అమెరికాలో ఎన్నికలు ముగియగానే, తన టీమ్ సహా ఇండియాకు వచ్చే స్టీవ్, ఇక్కడే మకాం వేసి ప్రచార బాధ్యతలు స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఆయన నవంబర్ నుంచి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతారని తెలుస్తోంది. హార్వార్డ్ స్కూల్ లో పబ్లిక్ పాలసీని బోధించే స్టీవ్ జార్డింగ్, 1980 నుంచి ప్రచారకర్తగా, మేనేజర్ గా, పొలిటికల్ కన్సల్టెంట్ గా, వ్యూహకర్తగా పలువురికి సేవలందించారు. ఆయన క్లయింట్ల జాబితాలో స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గోరె, హిల్లరీ క్లింటన్ వంటి వారెందరో ఉన్నారు. ఇదిలావుండగా, ప్రస్తుతం యూపీలో ఉన్న ఆయన, ప్రచారంలో మార్పు చేర్పులను సూచించారు. 'సమాజ్ వాదీ పెన్షన్ యోజన'కు ప్రచారం కల్పించేందుకు నటి విద్యాబాలన్ ను యూపీ సర్కారు నియమించుకోగా, ఈ పథకం బాగుందని, అయితే లబ్ధిదారులకు ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకమన్న అనుమానాలున్నాయని స్టీవ్ అభిప్రాయపడ్డారు. పథకానికి ప్రచారం చేస్తున్న తీరును మార్చాలని సలహా ఇచ్చారు. ఇక యువతతో నిత్యం దగ్గరగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం ఇత్యాది విషయాల్లో అఖిలేష్ కు ఆయన నిత్యమూ సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.