: ఏం చేద్దాం..? యూరి ఉగ్రదాడిపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభం
జమ్ముకశ్మీర్‌లోని యూరి సైనిక కార్యాలయంపై పాకిస్థాన్ ముష్కరులుగా భావిస్తోన్న ఉగ్రవాదులు దారుణంగా దాడిచేసి 17 మంది జవాన్ల ప్రాణాలు తీసిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష ప్రారంభమయింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఐబీ, ఇంటెలిజెన్స్ తో పాటు హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో భారత్ తీసుకోవాల్సిన తదుపరి చర్యను గురించి చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజ్‌నాథ్, పారికర్ ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.