: సాధ్యం కాదన్న 'సరి-బేసి'ని చేసి చూపాం, దోమలను చంపలేమా?: కేజ్రీవాల్
బెంగళూరులో నాలుక సర్జరీ అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా మాట్లాడారు. ఓ వీడియో సందేశాన్ని ఇచ్చిన ఆయన, "పాకిస్థాన్ తో ఆటలాడాల్సి వచ్చిన వేళ, దేశమంతా ఒకే తాటిపై నిలుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలూ డెంగ్యూ చికున్ గున్యా వ్యాధుల నివారణకు ఏకం కావాలి. రాజకీయ ప్రయోజనాలు చూడొద్దు. సాధ్యం కాదన్న 'సరి-బేసి' విధానాన్ని చేసి చూపించాం. ఈ దోమలపై విజయం సాధించలేమా?" అని ప్రశ్నించారు. కాగా, స్టడీ టూర్ నిమిత్తం ఫిన్ ల్యాండ్ వెళ్లిన మనీష్ శిసోడియా సైతం ఇండియాకు తిరిగి వస్తుండగా, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, జ్వర బాధితులతో నిండిన లోక్ నాయక్ హాస్పిటల్, జయప్రకాష్ హాస్పిటల్, బారా హిందూరావ్ హాస్పిటల్ లను సందర్శించారు. మొత్తం 3 వేల మందికి పైగా జ్వర పీడితులు ఆసుపత్రులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. డెంగ్యూ, చికున్ గున్యాల కారణంగా ఢిల్లీలో 27 మంది వరకూ చనిపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.