: 17 మంది ప్రాణత్యాగం వృథా కానివ్వం: పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటామన్న పారికర్
యూరీ ఘటనలో 17 మంది భారత వీర జవాన్ల ప్రాణత్యాగాన్ని వృథా కానివ్వబోమని, పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు, వారి వెనకుండి ప్రోత్సహించిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పారికర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సైన్యానికి సూచించినట్టు ఆయన తెలిపారు. యూరీ దాడి నేపథ్యంలో కాశ్మీర్ లోయలో పరిస్థితిని సమీక్షించామని, దాడి కారకులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలి పెట్టేది లేదని తెలిపారు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలన్న విషయమై కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయమై చర్చిస్తున్నట్టు పారికర్ పేర్కొన్నారు. ఆర్మీ సైనిక స్థావరం వద్ద భద్రతాపరమైన లోపాలు ఉన్నాయా? అన్న కోణంలోనూ సమీక్షించామని తెలిపారు. ఎదురుగా వచ్చి భారత సైన్యాన్ని ఎదుర్కోలేకనే ముష్కరులు ఇలా వెనక నుంచి దెబ్బ కొడుతున్నారని ఆయన విమర్శించారు. పాక్ తన భూభాగంపై ఉన్న అన్ని ఉగ్ర స్థావరాలను, ఉగ్రవాద సంస్థలనూ ఏరిపారేయాల్సిందేనని డిమాండ్ చేశారు.