: బాధితుడిని బంతాట ఆడుకున్న ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల వైద్యులు.. సకాలంలో వైద్యం అందక యువకుడి మృతి
వైద్యుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణం తీసింది. సకాలంలో వైద్యం అంది ఉంటే 23 ఏళ్ల ప్రకాష్ బతికి ఉండేవాడు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో ఆయన ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హైదరాబాద్‌కు తరలించారు. తొలుత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో స్కానింగ్ మిషన్ లేదని, ఉస్మానియాకు తీసుకెళ్లాలంటూ అక్కడి సిబ్బంది రెఫర్ చేశారు. ఉస్మానియాకు వెళ్తే వెంటిలేటర్లు లేవంటూ తిరిగి గాంధీ ఆస్పత్రికి సిఫారసు చేశారు. సకాలంలో వైద్యం అందాల్సిన ప్రకాష్ ఇలా నాలుగు గంటలకు పైగా సాగిన ఆసుపత్రుల ఆటకు బలైపోయాడు. చివరికి వైద్యం అందక పరిస్థితి విషమించి కన్నుమూశాడు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం, వసతుల లేమిపై బాధిత బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాష్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.