: యుక్తవయసులో లైంగిక వేధింపులకు గురయ్యా.. సినీ నటి తాప్సీ


సినీ నటి తాప్సీ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను యుక్తవయసులో ఉండగా లైంగిక వేధింపులకు గురయ్యానని తాప్సి పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు కరువైన ఈ ఢిల్లీ భామ ఇటీవల బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పింక్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో తాప్సీ అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించింది. తాను ధైర్యవంతురాలినని పలుమార్లు చెప్పిన తాప్సీ తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు సినీ పరిశ్రమలోనూ ఇటు జనాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పింక్‌లో తాను నటించిన పాత్రకు, తన నిజ జీవితానికి మధ్య చాలా పోలికలు ఉన్నట్టు తాప్సీ ట్విట్టర్‌లో పేర్కొంది. తాను ఢిల్లీలో పెరిగానని పేర్కొంది. ఉత్సవాల సమయంలో గుమిగూడే అబ్బాయిలు.. అమ్మాయిలను అల్లరి పెడుతుంటారని, లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారని, అలాంటి వేధింపులు తనకూ ఎదురయ్యాయని పేర్కొంది. అబ్బాయిల చూపులు చాలా క్రూరంగా ఉంటాయని, ద్వంద్వార్థాలతో హింసిస్తుంటారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మంచి దుస్తులు ధరించాలని, అలాంటి చోట్లకు వెళ్లవద్దని పెద్దలు చెప్పేవారని గుర్తు చేసుకుంది. అయితే అప్పట్లో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై నోరెత్తకపోవడం, ఎదురించకపోవడం తాను చేసిన పెద్ద తప్పు అని ఇప్పుడు అనిపిస్తోందని పేర్కొంది. ఇప్పటి వరకు ఏనాడూ ఈ విషయంపై నోరెత్తని ఈ సొట్టబుగ్గల సుందరి ఇప్పుడు అకస్మాత్తుగా లైంగిక వేధింపులను ఎందుకు బయటకు తీసుకొచ్చిందనే విషయంపై సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News