: ఎయిర్‌టెల్‌పై దుమ్మెత్తి పోస్తున్న రిలయన్స్.. జియో నెట్‌వర్క్‌లోనే లోపం ఉందంటున్న ఎయిర్‌టెల్
రిలయన్స్, ఎయిర్‌టెల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇంటర్ కనెక్టివిటీ పాయింట్ల(పీఓఐ) విషయంలో ఎయిర్‌టెల్ తమను మోసం చేసిందని రిలయన్స్ ఆరోపించింది. ఇస్తామన్న పీఓఐలు ఇవ్వకపోవడంతో రోజూ రెండు కోట్లకు పైగా కాల్స్ డ్రాప్ అవుతున్నట్టు పేర్కొంది. పోర్టబులిటీ కింద రిలయన్స్‌కు మారే వారిని కూడా ఎయిర్‌టెల్ అడ్డుకుంటోందంటూ తీవ్రంగా విమర్శించింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ట్రాయ్ వెంటనే రంగంలోకి దిగాలని కోరింది. తమ రెండు నెట్‌వర్క్‌ల మధ్య కాల్స్ పూర్తి కావడానికి అవసరమైన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్స్‌లో నాలుగో వంతు ఇచ్చిందని, ఫలితంగా ఉచిత వాయిస్ కాల్స్ అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. మార్కెట్లో తమకున్న పేరును దెబ్బతీసేందుకు ఎయిర్‌టెల్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అయితే, రిలయన్స్ ఆరోపణలను ఎయిర్‌టెల్ ఖండించింది. రిలయన్స్ జియో అవసరాలకు మించి కనెక్టివిటీ పాయింట్లను ఇచ్చామని చెబుతోంది. పెంచిన పీఓఐలతో రిలయన్స్ జియో 1.5 కోట్ల కంటే ఎక్కువ మంది ఎటువంటి కాల్ డ్రాప్స్ లేకుండా వాయిస్ సేవలు అందుకునే అవకాశం ఉందని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. రిలయన్స్‌కు ఉన్న పది కోట్ల మంది ఖాతాదారుల అవసరాల కంటే ఎక్కువ పీఓఐలే ఇచ్చినట్టు పేర్కొంది. జియో టెక్నాలజీలోనే లోపం ఉందని, దానిని సరిచేసుకోకుండా తమపై నిందలు వేయడం బాధాకరమని పేర్కొంది.